ఫేస్బుక్లో మోదీ వీడియో తొలగింపు.. క్షమాపణ చెప్పిన మెటా
ఫేస్బుక్లో మోదీ వీడియో తొలగింపు.. క్షమాపణ చెప్పిన మెటా
PM Narendra Modi (File)


హైదరాబాద్, 28 జూలై (హి.స.)

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో కొద్దిసేపు నిలిపివేసిన ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణ చెప్పింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదని, సాంకేతిక లోపం వల్లేనని వివరణ ఇచ్చింది. పొరపాటు గుర్తించిన వెంటనే వీడియోను పునరుద్ధరించినట్లు మెటా ప్రతినిధి వెల్లడించారు.

జులై 23న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో విద్యార్థుల నిరసనల సందర్భంగా జనరేషన్ జెడ్‌ను ఉద్దేశించి మోదీ సందేశం ఇచ్చారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీక్‌లను అరికట్టేందుకు కఠిన చర్యలు ప్రకటిస్తామని అందులో పేర్కొన్నారు. అయితే కొద్దిసేపు ఈ వీడియోను తెరవడానికి ప్రయత్నించిన వినియోగదారులకు ‘చట్టపరమైన అభ్యర్థన మేరకు ఈ ప్రాంతంలో వీడియోను నిలిపివేశాం’ అనే సందేశం కనిపించింది. అనంతరం వీడియోను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. మెటా ఇచ్చిన వివరణతో పాటు వీడియో తొలగింపునకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తోంది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని మెటా ప్రతినిధులు, సంబంధిత అధికారులను కేంద్రం పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ ఇప్పటికే మెటా, ఇన్‌స్టాగ్రామ్ ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande