
నెల్లూరు,, 06 జూలై (హి.స.)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణతీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అడ్డుపడితే ప్రజలు సహించరని.. మంచిని చెడుగా చూపిస్తే, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈరోజు(సోమవారం) నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మల్లెల సంజీవయ్య హైస్కూల్, ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు
వైసీపీ హయాంలో మూసేసిన వీఆర్సీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పున: ప్రారంభించామని మంత్రి తెలిపారు. వీఆర్సీని తలదన్నేలా మరో 15 హైస్కూల్స్ను ఆధునికీకరిస్తున్నామని చెప్పుకొచ్చారు. వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని స్కూల్స్ సిద్ధం చేస్తామని వెల్లడించారు. వైసీపీ నేతలు వాటిపైనా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధికోసం, ఉనికి కోసం జగన్ అండ్ కో ఆరోపణలు చేస్తే చెడ్డవారిగా మిగిలిపోతారని హెచ్చరించారు. పరిశుభ్రతతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. మంత్రి లోకేశ్ ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరులో స్కూల్స్ను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ