కడలిలో కల్లోలం.. ఒకరు మృతి, ఆరుగురి గల్లంతు.. విశాఖలో కొనసాగుతున్న గాలింపు
కడలిలో కల్లోలం.. ఒకరు మృతి, ఆరుగురి గల్లంతు.. విశాఖలో కొనసాగుతున్న గాలింపు
sea


అనకాపల్లి, 06 జూలై (హి.స.)

ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో సోమవారం రెండు వేర్వేరు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. అనకాపల్లి జిల్లాలో పడవ బోల్తా పడిన ఘటనలో ఒక మత్స్యకారుడు మృతి చెందగా, విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం రెండో రోజూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రెండు సంఘటనలతో మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా రేవూపోలవరం తీరంలో నలుగురు మత్స్యకారులతో వెళుతున్న పడవ అలల ఉద్ధృతికి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సురక్షితంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. చోడిపల్లి సింహాద్రి (రేవూపోలవరం వాసి) అనే మత్స్యకారుడు గల్లంతై మృతి చెందాడు. అతని మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది.

మరోవైపు విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం భారత నావికాదళం, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు సంయుక్తంగా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్, ప్రత్యేక నౌక, రెస్క్యూ బోట్లతో గాలింపును కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో కార్గో షిప్ ద్వారా రక్షించబడిన కారి చిన్న అనే మత్స్యకారుడు (బోటు యజమాని) ఇచ్చిన సమాచారం ఆధారంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి 72 గంటలు చాలా కీలకమని, మత్స్యకారులు ప్రాణాలతో దొరుకుతారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande