ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్
ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్
Collector


నాగర్ కర్నూల్, 06 జూలై (హి.స.)

రైతులకు ఎలాంటి ఇబ్బందులు

తలెత్తకుండా యూరియా ఎరువులను సకాలంలో, పారదర్శకంగా, సమర్థవంతంగా పంపిణీ చేయాలని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు, లాభదాయకమైన కూరగాయల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం బిజినేపల్లి మండల కేంద్రంలోని మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ రైతులకు యూరియా పంపిణీ జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించి, రైతులతో మాట్లాడి ఎరువుల లభ్యత, పంపిణీ విధానం, ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు పొందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, సహకార శాఖ అధికారులతో కలెక్టర్ మండలంలో ప్రస్తుతం ఉన్న యూరియా నిల్వలు, రైతుల డిమాండ్, పంపిణీ ప్రక్రియ, పంటల సాగు విస్తీర్ణం, వర్షపాతం పరిస్థితులు తదితర అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు.

వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్కు వివరాలు అందిస్తూ బిజినేపల్లి మండలంలో ప్రస్తుతం మొత్తం 244 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 62 టన్నుల యూరియా నిల్వ ఉందని, రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకున్న అవసరాలకు అనుగుణంగా బయోమెట్రిక్ విధానంలో పారదర్శకంగా పంపిణీ జరుగుతోందని, ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు అదనపు నిల్వలు కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. మండలంలోని వ్యవసాయ పరిస్థితులను వివరిస్తూ, ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 12,345 ఎకరాల్లో పత్తి పంటల సాగు జరిగిందని, ఇప్పటివరకు 31 ఎకరాల్లో వరి, 45 ఎకరాల్లో మొక్కజొన్న, 79 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు ప్రారంభమైనట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. రానున్న రోజుల్లో వర్షాలు కురిసిన వెంటనే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. .

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande