పహల్గామ్ దాడి వెనుక పాక్ కుట్ర.. హఫీజ్ సయీద్ను నిందితుడిగా చేర్చిన ఎన్ఐఏ
పహల్గామ్ దాడి వెనుక పాక్ కుట్ర.. హఫీజ్ సయీద్ను నిందితుడిగా చేర్చిన ఎన్ఐఏ
pahalgam


కశ్మీర్‌, 06 జూలై (హి.స.)

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ను నిందితుడిగా పేర్కొంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదనపు చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ దాడి వెనక సరిహద్దు అవతల నుంచి పన్నిన కుట్ర, ఉగ్రవాద సంస్థల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.

జమ్మూలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో దాఖలైన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో హఫీజ్‌ సయీద్‌ను వ్యక్తిగత హోదాలోనే కాకుండా నిషేధిత లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ (టీఆర్‌ఎఫ్‌) అధినేతగా కూడా నిందితుడేనని పేర్కొంది. అతనిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)-2023, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)-1967 కింద పలు అభియోగాలు నమోదు చేసింది. భారత్‌పై యుద్ధం చేయడానికి కుట్ర పన్నడం, ఉగ్రదాడికి సరిహద్దు అవతల నుంచి ప్రణాళిక రూపొందించడం వంటి తీవ్రమైన ఆరోపణలను కూడా ఎన్‌ఐఏ చేర్చింది.

ఇప్పటికే దాఖలైన 1,597 పేజీల అసలు చార్జ్‌షీట్‌కు కొనసాగింపుగా ఈ అదనపు చార్జ్‌షీట్‌ను సమర్పించినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. శాస్త్రీయ ఆధారాలు, క్షేత్రస్థాయి విచారణ, సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా పాకిస్థాన్ కుట్ర, హఫీజ్‌ సయీద్ పాత్రను వివరించినట్లు వెల్లడించింది.

గతేడాది డిసెంబర్‌ 15న దాఖలైన తొలి చార్జ్‌షీట్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది సాజిద్‌ జట్, ఆపరేషన్‌ మహాదేవ్‌లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు, అరెస్టయిన ఇద్దరు నిందితులను ఎన్‌ఐఏ చేర్చింది. లష్కరే తోయిబా, టీఆర్‌ఎఫ్‌లపై కూడా అభియోగాలు మోపింది.

2025 ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో జరిగిన ఈ దాడిలో మతాన్ని లక్ష్యంగా చేసుకుని పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు.

మొదట అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం కేంద్ర హోంశాఖ ఈ కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేసింది. పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌, ఈ దాడి వెనుక ఉన్న విస్తృత కుట్రపై దర్యాప్తు కొనసాగుతోందని ఎన్‌ఐఏ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande