ఏనుగు దంతాల కేసు: హైకోర్టు ముందుకు మోహన్లాల్ ఐటీ డిక్లేరేషన్ పత్రాలు
ఏనుగు దంతాల కేసు: హైకోర్టు ముందుకు మోహన్లాల్ ఐటీ డిక్లేరేషన్ పత్రాలు
mohan lal


హైదరాబాద్, 06 జూలై (హి.స.)

మలయాళ సూపర్ స్టార్, పద్మభూషణ్ మోహన్‌లాల్‌ను సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ఏనుగు దంతాల అక్రమ నిల్వ కేసు కేరళ హైకోర్టులో సరికొత్త మలుపు తిరిగింది. గతంలో ఆయన ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ నివేదిక ఇప్పుడు న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఆ పత్రాల ప్రకారం... మోహన్‌లాల్ వద్ద కేవలం నాలుగు మాత్రమే కాకుండా, మొత్తం 10 ఏనుగు దంతాలతో పాటు దంతాలతో చేసిన మరో 13 కళాఖండాలు (విగ్రహాలు) ఉన్నాయి. ఈ వివరాలను ఆయన స్వయంగా వెల్లడించారు.

2011 జూన్ నెలలో మోహన్‌లాల్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొచ్చిలోని ఆయన సొంత నివాసంలో నాలుగు ఏనుగు దంతాలు దొరికాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం ముందస్తు అనుమతులు లేకుండా ఇలాంటి నిషేధిత వస్తువులను దగ్గర ఉంచుకోవడం నేరం కావడంతో కేరళ అటవీ అధికారులు నాడు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం గత పదేళ్లుగా కోర్టు పరిధిలోనే నలుగుతోంది.

మరోవైపు, మోహన్‌లాల్ ఎలాంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడలేదని ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన ప్రత్యేక 'ఐవరీ అమ్నెస్టీ' పథకం కింద ఈ సమాచారాన్ని ముందే డిక్లేర్ చేశామని కోర్టుకు వివరించారు. అయితే, ఐటీ శాఖకు వివరాలు అందజేసినప్పటికీ... అటవీ చట్టాల ప్రకారం ఈ దంతాలను కలిగి ఉండటానికి అవసరమైన అధికారిక యాజమాన్య ధ్రువీకరణ పత్రాన్ని మోహన్‌లాల్ సకాలంలో పొందారా? లేదా? అనే లీగల్ పాయింట్‌పైనే ప్రస్తుతం హైకోర్టులో ప్రధానంగా విచారణ సాగుతోంది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande