
విశాఖపట్నం:, 27 ఆగస్టు (హి.స.)
విశాఖలోని షీలానగర్లో లారీ డ్రైవర్పై దాడి ఘటనలో రవాణాశాఖ ఇన్స్పెక్టర్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్నూ మల్కాపురం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విశాఖలో అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న పార్వతి ఈ నెల 20వ తేదీన షీలానగర్ మారుతీ సర్కిల్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో ఛత్తీస్గడ్కు చెందిన ఓ లారీ.. పోర్టు నుంచి లోడ్తో వస్తోంది. ఆ లారీని ఇన్స్పెక్టర్ పార్వతి ఆపారు.
కానీ, లారీ డ్రైవర్ వాహనాన్ని నిలుపకుండా ముందుకు వెళ్లిపోయారు. దీంతో పార్వతి డ్రైవర్ వాహనాన్ని వెంబడించి లారీని అడ్డగించారు. ఆపై లారీ క్యాబిన్లోకి ఎక్కి విచక్షణారహితంగా అతడిపై దాడి చేశారు. దీంతో లారీ డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై లారీ ఓనర్ల అసోసియేషన్ మల్కాపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దానితో పాటు లారీ ఓనర్ల సంఘం ప్రతినిధి శేషగిరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై స్పందించిన హైకోర్టు.. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని సీపీకి ఆదేశాలు జారీ చేసింది.
వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్
లారీ డ్రైవర్పై దాడి జరిగిన సమయంలో ఇన్స్పెక్టర్ పార్వతి అక్కడే ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొంటూ పోలీసులు ఉన్నతాధికారులకు నివేదికను అందించారు. ఈ నివేదికపై రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా స్పందించారు. ఈ ఘటనపై వివరణ కోరుతూ బ్రేక్ ఇన్స్పెక్టర్ పార్వతికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆమెను సస్పెండ్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
డ్రైవర్ వాంగ్మూలమే కీలకం
లారీ డ్రైవర్ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగుతుందని పోలీసులు తెలిపారు. సెల్ఫోన్ నెంబర్ ఆధారంగా లారీడ్రైవర్ ప్రస్తుతం ఛత్తీస్గడ్లో ఉన్నట్టు గుర్తించారు. అతడిని ఏపీకి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. తదుపరి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ