
అమరావతి, 30 ఆగస్టు (హి.స.)
, :ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులను మరింత సంతోషపరచాలని భావించిన ముఖ్యమంత్రి తాజాగా వారిని ‘ప్రత్యేకం’గా ఆదుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నెల రోజులకు సరిపోయేలా నిత్యావసరాలు, 30 రోజుల వరకు పశువులకు దాణా, నిర్వాసిత కుటుంబాల్లోని మహిళలకు పసుపు-కుంకుమ కిట్లను అందించాలని సర్కారు నిర్ణయించింది. దీనికిగాను రూ.4.07 కోట్లను తక్షణమే విడుదల చేసింది. ఈ మేరకు జల వనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వాసిత కుటుంబాలకు చెందిన పశువుల దాణాకు రూ.65.8 లక్షలు కేటాయించారు. 10 గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలకు చెందిన 4,933 పశువులకు 30 రోజుల పాటు దాణాను ప్రభుత్వమే అందించనుంది. దీనికిగాను మొత్తం 295.98 టన్నుల దాణా అవసరమని గుర్తించింది. అలాగే, నిర్వాసితులకు నిత్యావసర సరుకుల కిట్ల కోసం రూ.2.81 కోట్లు కేటాయించింది. రూ.2,818 విలువైన ఒక్కొక్క కిట్ను 10 వేల కుటుంబాలకు అందించనున్నారు. ఈ కిట్లో 25 కిలోల బియ్యం, కిలో పప్పు, కిలో చక్కెర, లీటర్ నూనె, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళాదుంపలు ఉంటాయి. అలాగే నిర్వాసిత కుటుంబాల్లోని మహిళలకు ప్రత్యేకంగా పసుపు, కుంకుమ, చీర, గాజులతో కూడిన కిట్ను అందించనున్నారు. రూ.వెయ్యి విలువైన ఈ కిట్లను 6 వేల మంది మహిళలకు ఇవ్వనున్నారు. దీనికిగాను రూ.60 లక్షలు కేటాయించారు. మొత్తం 3 విభాగాలకు కలిపి రూ.4.7 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్వాసితుల సంతోషమే లక్ష్యమని పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కాగా, ఇప్పటికే రూ.768 కోట్లను నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారంగా అందించిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ