
కర్నూలు, 30 ఆగస్టు (హి.స.)వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరించింది. మరికొన్ని గంటల్లో అల్పపీడనం ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలోకి, ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల్లోకి వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వర్షాలు, వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఇలా ఉంటుంది..అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తిగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. దాదాపు ఏపీలోని అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాల్లో కూడా ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV