
Andhra Pradesh, 30 ఆగస్టు (హి.స.) జీవితాలను నాశనం చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. క్షణికావేశాలు, మోజుల వెనుక దాగి ఉన్న ప్రమాదాన్ని గ్రహించకపోవడంతో పచ్చని సంసారాలు కూలిపోవడమే కాదు.. ప్రాణాలు తీసే దారుణాలకు దారితీస్తున్నాయి. అనంతపురం (Anantapur) జిల్లాలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిని వేటకొడవళ్లతో దారుణంగా నరికిచంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్లాన్ ప్రకారం శివారుకు పిలిపించి..
వివరాల్లోకి వెళితే.. పాపంపేట (Pampampet)కు భరద్వాజకు చందన (Chandana) అనే వివాహితతో కోన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే, ఇటీవలే విషయం చందన భర్త శ్రీహరి (Srihari)కి తెలియడంతో అతడు తొలుత తీవ్రంగా మందలించాడు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని సక్రమంగా మెలగాలని వార్నింగ్ ఇచ్చాడు. కానీ.. చందన, ప్రియుడు భరద్వాజలు శ్రీహరి మాటను పెడచెవున పెడుతూ వచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త శ్రీహరి, భరద్వాజను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం స్నేహితులతో కలిసి మర్డర్ పక్కా ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా భార్య చందనతో భరద్వాజకు ఫోన్ చేయించి, ఏకాంతంగా కలుద్దామని చెప్పించాడు. చందన మాటలు నమ్మిన భరద్వాజ పాపంపేట శివారు ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ముందే వేచి ఉన్న శ్రీహరి, అతడి స్నేహితులు భరద్వాజపై ఒక్కసారిగా వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి నరికారు. దీంతో అతడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
రంగంలోకి దిగిన పోలీసులు..
అయితే, ఈ దారుణ ఘటనపై మృతుడు భరద్వాజ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు (Police) హుటాహుటన రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV