
హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కేబినెట్లోని మంత్రులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ లేదని, వారి శాఖలపై మంత్రులకే అధికారం, పూర్తి హక్కులు కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. మంత్రులకు తగిన స్వేచ్ఛ ఇవ్వకపోతే రానున్న రోజుల్లో లేని సమస్యలు తెరపైకి వచ్చి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. అదే సమయంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుశ్మిత చేసిన వ్యాఖ్యలను కూనంనేని తప్పుపట్టారు. రాజకీయంలో విధానపరమైన విమర్శలు ఉండాలి తప్ప, సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతమాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు రాష్ట్రంలో భూ సమస్యలు, ప్రభుత్వ అలసత్వంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో (Prohibited List) పెట్టడం వల్ల ప్రజలు, రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తీవ్ర అలసత్వంతో వ్యవహరిస్తోందని, సమస్యల తీవ్రతను గుర్తించి వెంటనే పరిష్కారం చూపడంలో విఫలమవుతోందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిషేధిత జాబితా భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కూనంనేని సాంబశివ రావు డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..