అటవీ నేరాలను నియంత్రించేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలి.. భద్రాద్రి కలెక్టర్
విధి నిర్వహణలో అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సేవలు, త్యాగాలు స్ఫూర్తిదాయకమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు.
Collector


భద్రాద్రి కొత్తగూడెం, 11 సెప్టెంబర్ (హి.స.)

విధి నిర్వహణలో అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సేవలు, త్యాగాలు స్ఫూర్తిదాయకమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు.

జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కొత్తగూడెం ఇల్లెందు క్రాస్రోడ్స్ లోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్ పార్క్ అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ అమరవీరుల సంస్మరణ సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు చలమల శ్రీనివాసరావు విగ్రహానికి జిల్లా కలెక్టర్ అంకిత్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ... అటవీ శాఖలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది అటవీ సంపద సంరక్షణలో అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ, భద్రతా పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇతర మౌలిక సౌకర్యాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో అటవీ నేరాలను నియంత్రించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని అటవీ సంపదను పరిరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మరింత అంకితభావంతో పని చేయాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande