
హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబరు నాటికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ సుమారు 15 వేల మెగావాట్లు ఉండగా.. ఈ నెల 9వ తేదీ నాటికి అది 19,543 మెగావాట్లకు చేరిందని అసెంబ్లీలో వెల్లడించారు.
రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలు విస్తరించడం, ప్రజల వినియోగ శక్తి పెరగడం తదితర కారణాలతో విద్యుత్ అవసరం వేగంగా పెరుగుతోందని భట్టి పేర్కొన్నారు. భవిష్యత్లో పెరిగే డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సంప్రదాయేతర ఇంధన వనరులను విస్తృతంగా వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. సౌర విద్యుత్, ఫ్లోటింగ్ సోలార్ తదితర మార్గాలను ప్రోత్సహించేందుకు విద్యుత్, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు. అధ్యయనం పూర్తయిన అనంతరం దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..