
భూపాలపల్లి, 11 సెప్టెంబర్ (హి.స.)
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు సూచించారు. శుక్రవారం భూపాలపల్లి పోలీస్టేషన్లో సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు, వాణిజ్య వ్యాపారులు, గణేష్ మండపాల నిర్వాహకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పాల్గొని పలు సూచనలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
గణేష్ మండపాల వద్ద భద్రత, బందోబస్తు ఏర్పాట్లకు వీలుగా మండపాల వివరాలను ముందుగానే పోలీస్ శాఖకు తెలియజేయాలని డీఎస్పీ సూచించారు. ఇందుకోసం 'ఆన్లైన్ ఇంటిమేషన్' విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. మండపం ఏర్పాటు చేసే ప్రాంతం, నిర్వాహకుల పేర్లు, ఫోన్ నంబర్లు తదితర పూర్తి వివరాలను ప్రత్యేక పోర్టల్లో నమోదు చేయాలన్నారు. కంప్యూటర్, మొబైల్ ద్వారా వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, ఇందుకు ఎలాంటి రుసుము లేదని ఆక్టిసు చేసి పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అనంతరం దాని ప్రతిని సంబంధిత పోలీసెస్టేషన్కు అందజేయాలని సూచించారు.
ప్రతి గణేష్ మండపం వద్ద మండప కమిటీ, బాధ్యత వహించే నిర్వాహకుల పేర్లు, ఫోన్ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలని పోలీసులు సూచించారు. విద్యుత్ శాఖ అనుమతితోనే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు 24 గంటలూ వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు నీటితో కూడిన డ్రమ్ములు, ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
గణేష్ మండపాలు, నిమజ్జన శోభాయాత్రల్లో డీజేలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. మండపాల వద్ద భక్తి గీతాలు మాత్రమే వినిపించాలని, ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదన్నారు. సాంస్కృతిక, ఇతర కార్యక్రమాల వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. నిమజ్జన శోభాయాత్రను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు నిర్వాహకులు సహకరించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..