
హైదరాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.) వెయ్యి రోజుల తర్వాత తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తమపై సీఎం రేవంత్రెడ్డి సర్కార్ దాడులకు తెగబడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ ఇంటిపైన దాడి చేస్తారా.? అని ఆగ్రహించారు. ఈరోజు (మంగళవారం) ఢిల్లీలో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత ఈ దాడిని ఆపాలని పోలీస్ స్టేషన్కు వెళ్తే తమపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. నిన్న మళ్లీ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లోపల తన పీఆర్వో, పీఏలపై 15 మందితో దాడికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు.
నిన్న పోలీస్ స్టేషన్లో దాడికి ప్రయత్నించింది గుండాలా?, పోలీసులా?, మఫ్టీలో వచ్చి దాడి చేసిన వారు ఎవరో తేలాలి? అని కేటీఆర్ డిమాండ్ చేశారు. తమ వారిపై జరిగిన దాడిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
తెలంగాణలో పోలీస్ శాఖ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పని చేస్తోందని విమర్శించారు. గుండాల మాదిరిగా పోలీస్ స్టేషన్లో దాడులకు తెగబడిన వారికి.. మద్దతు ఇచ్చిన వారిపై ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేయట్లేదని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేని ఘోరమైన పరిస్థితి తెలంగాణలో ఉందని ఆగ్రహించారు. ఈ అంశంలో కోర్టులను ఆశ్రయిస్తామని... కోర్టుల్లో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్