ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ తో సీఎం రేవంత్ సమావేశం
అగా ఖాన్ ఫౌండేషన్పై అత్యంత గౌరవం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
Revanthreddy


హైదరాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.) అగా ఖాన్ ఫౌండేషన్పై అత్యంత గౌరవం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు(మంగళవారం) తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘మా వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. అగా ఖాన్ ఫౌండేషన్ సహకారంతో ఇటీవలే మా శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించుకున్నాం. అగా ఖాన్ ఫౌండేషన్ కుతుబ్ షాహీ టూంబ్స్ను పునరుద్ధరించింది’ అని తెలిపారు.

మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో అగా ఖాన్ ఫౌండేషన్ సహకారాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని సీఎం అన్నారు. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని చెప్పారు. మూసీ నదిని నైట్ ఎకానమీ కోసం తీర్చిదిద్దుతామని వెల్లడించారు.

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 100కు పైగా దేశాల ప్రతినిధులు ఈ సమ్మిట్కు హాజరవుతారన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. సింగపూర్కు చెందిన కంపెనీ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తోందని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ లాంటి సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande