
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స)
గతంలో బిఆర్ఎస్ ధరణి పోర్టల్ ద్వారా దోపిడీకి పాల్పడ్డారని, ఆ వ్యవస్థతో జరిగిన చారిత్రక తప్పులను తమ ప్రజా ప్రభుత్వం సరిదిద్దేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే అకారణంగా తమపై బిఆర్ఎస్ వారు నిందలు వేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
నేడు వారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. అధికారుల తప్పిదం వల్ల ఎక్కడైనా చిన్నపాటి లోపాలు జరిగినా వాటిని ప్రభుత్వం వెంటనే సరిచేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోటి ఎకరాల భూములను 22A జాబితాలో చేర్చారంటూ బీఆర్ఎస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని, వాస్తవానికి హైకోర్టు ఆదేశాలు, న్యాయపరమైన వివాదాలు ఉన్న కేవలం 3.60 లక్షల ఎకరాల భూములను మాత్రమే నిబంధనల ప్రకారం నిషేధిత జాబితాలో ఉంచినట్లు ఆయన వివరించారు.ఒకవైపు రాష్ట్ర శాసనసభ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతతో కొనసాగుతుంటే, సభకు హాజరు కాకుండా సమాంతరంగా 'మాక్ అసెంబ్లీ' నిర్వహించడం వారి చిలిపి చేష్టలకు, బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. పుష్కలంగా అవినీతి సొమ్ము ఉండటంతోనే ఇలాంటి నాటకాలకు తెరతీస్తున్నారని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు