
ఆంధ్రప్రదేశ్ , 18 సెప్టెంబర్ (హి.స.)ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 21వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది. విశాఖను అంతర్జాతీయ స్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మొత్తం రూ.526.25 కోట్ల పెట్టుబడులతో 10 ఐటీ ప్రాజెక్టులకు బోర్డు ఆమోదముద్ర వేసింది.
ఈ విడత ఆమోదం పొందిన 10 ఐటీ ప్రాజెక్టుల్లో ఏకంగా 7 క్వాంటం ప్రాజెక్టులు ఉండటం విశేషం. భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానమైన క్వాంటం కంప్యూటింగ్, ఏఐ రంగాల్లో విశాఖను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్టులు దోహదం చేయనున్నాయి.
అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన కన్సల్టింగ్ దిగ్గజం డెలాయిట్ విశాఖలో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రూ.43.75 కోట్ల అంచనా వ్యయంతో రానున్న ఈ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ముత్తూట్ ఫిన్కార్ప్ సమర్పించిన రూ. 100 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనకు బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ భారీ ప్రాజెక్టుల రాకతో విశాఖలో ఐటీ ఇండస్ట్రీ సరికొత్త ఊపు అందుకోనుందని పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మరియు, ఇప్పటివరకు జరిగిన 20 ఎస్ఐపీబీ సమావేశాల్లో 359 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.13.84 లక్షల కోట్ల పెట్టుబడులు, 10.59 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్