కర్నూలు - మచిలీపట్నం మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ రైలు
రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రయాణించే వారికి భారతీయ రైల్వే శుభవార్త అందించింది.
Train


కర్నూలు , 29 సెప్టెంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రయాణించే వారికి భారతీయ రైల్వే శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మచిలీపట్నం, కర్నూలు సిటీ మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. ఈ రైలు విజయవాడ, గుడివాడ, నంద్యాల మీదుగా ప్రయాణిస్తూ కీలక ప్రాంతాలను కలుపుతుంది. సుమారు 499 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ సర్వీసు, వారానికి మూడు రోజుల చొప్పున రెండు దిశల్లోనూ అందుబాటులో ఉండనుంది.

కర్నూలు నుంచి మూడు రోజులు..

మచిలీపట్నం నుంచి సోమవారం, బుధవారం, శనివారం ఈ ఎక్స్ప్రెస్ రైలు సాయంత్రం 4.55కు బయలుదేరీ మరుసటి రోజు ఉదయం 5.45 కు కర్నూలు కు చేరుతుంది. కర్నూలు నుంచి మంగళవారం, గురువారం, ఆదివారం తిరుగు ప్రయాణం చేయనుంది. మచిలీపట్నం నుంచి కర్నూలు సిటీ వరకు సుమారు 500 కిలోమీటర్ల మేర ఈ రైలు ప్రయాణించనుందని అధికారులు చెపుతున్నారు.

ప్రధాన స్టేషన్ల మీదుగా..

ఈ కొత్త ఎక్స్ప్రెస్ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, నంద్యాల, బేతంచెర్ల, డోన్ మీదుగా కర్నూలుకు చేరుకుంటుంది. దీంతో ఈ మార్గంలోని పలు ప్రాంతాల ప్రయాణికులకు కర్నూలు, మచిలీపట్నం మధ్య నేరుగా రైలు ప్రయాణ సదుపాయం కలుగుతుంది. కొత్త రైలు సర్వీసు అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల మధ్య రవాణా అనుసంధానం మెరుగుపడటంతో పాటు, వ్యాపార, విద్య, ఉద్యోగ, వైద్య అవసరాల కోసం ప్రయాణించే వారికి ప్రయోజనం కలగనుంది. రైలు సర్వీసు ప్రారంభ తేది , రైలు నంబర్ తదితర వివరాలను రైల్వే శాఖ అధికారికంగా తొందరలోనే వెల్లడించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande