20 గంటల్లో చైన్ స్నాచింగ్ కేసును చేధించిన మేడిపల్లి పోలీసులు
మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన ఇద్దరు నిందితులను మేడిపల్లి పోలీసులు 20 గంటల్లోనే అరెస్ట్ చేశారు.
Police


హైదరాబాద్, 04 సెప్టెంబర్ (హి.స.)

మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన ఇద్దరు నిందితులను మేడిపల్లి పోలీసులు 20 గంటల్లోనే అరెస్ట్ చేశారు.

మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 2న రాత్రి 8.20 గంటలకు ఆర్టీసీ కాలనీ వద్ద చల్లా భారతి (38) నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన నిందితుడు ఆమె మెడలోని మూడు తులాల బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కున్నాడు.

అనంతరం కొంత దూరంలో బైక్పై వేచి ఉన్న తన స్నేహితుడితో కలిసి చెంగిచెర్ల వైపు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు రాజమండ్రికి చెందిన కంగాల వీవీఎస్పీ ప్రసాద్ (39), వృత్తిరీత్యా డ్రైవర్, వరంగల్, నర్సంపేటకు చెందిన అజ్మీర వెంకటేష్ (24), ప్రైవేట్ ఉద్యోగిగా పోలీసులు తెలిపారు. ఇద్దరూ స్నేహితులు కాగా.. ఆర్థిక ఇబ్బందులతో మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్కు పథకం వేసినట్లు విచారణలో వెల్లడైంది. ఓఎన్ఎన్ యాప్ ద్వారా ద్విచక్ర వాహనం బుక్ చేసుకుని పోచారం, చెంగిచెర్ల తదితర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 3 తులాల బంగారు పుస్తెలతాడు, రెండు సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande