
హైదరాబాద్, 04 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇస్కాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆలయాలను పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈరోజు(శుక్రవారం) తెల్లవారుజాము నుంచే వేణుగోపాలుడి ఆలయాలకు భక్తులు క్యూకట్టారు. ఆ మాధవుడి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టి సంబరాలు చేసుకుంటున్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ భక్తులతో కిటకిటలాడుతోంది. దర్శనం కోసం నగరం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. జన్మాష్టమిని పురస్కరించుకుని ఇస్కాన్ ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తుల కోసం ప్రత్యేక దర్శనం, క్యూలైన్ను ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భజనలు, కీర్తనలతో ఇస్కాన్ ఆలయం మార్మోగుతోంది.
మరియు సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లికార్జున స్వామివారి ఆలయంలో యాదవ పూజారుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాదవ సంప్రదాయం ప్రకారం స్వామివారికి యాదవులు పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీకృష్ణ, గొల్లభామ వేషధారణలో యాదవ పూజారులు ఉట్టి కొట్టారు. ఆలయ పురవీధుల్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్