
అమరావతి, 05 సెప్టెంబర్ (హి.స.)
అమరావతిలో వరద ప్రవాహం ఆపేందుకు ఏపీ ప్రభుత్వం కృష్ణానది కుడి కరకట్టను భారీ వ్యయంతో ఆధునికీకరిస్తోంది. వరద ముంపు నుంచి నదీతీర గ్రామాలను రక్షించడానికి సుమారు ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ కరకట్టను ఇప్పుడు 24 మీటర్ల వరకూ విస్తరిస్తున్నారు.
ఎంతటి భారీ వరద ప్రవాహం వచ్చినప్పటికీ అమరావతికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రక్షణ కవచాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీనితో పాటు రాజధాని అమరావతి మౌలిక రహదారుల సముదాయంలో భాగంగా కరకట్టను ఈ రోడ్డుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పనులు పూర్తయితే విజయవాడ నుంచి వచ్చే ప్రయాణికులు ప్రకాశం బ్యారేజీ దిగిన వెంటనే ఈ రోడ్డు మీదుగా నేరుగా అమరావతికి చేరుకోవచ్చు. కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో తీర గ్రామాలకు రక్షణగా కుడి కరకట్టను 1954లో నిర్మించారు. మొత్తం 22 కిలోమీటర్ల పొడవు, 18 అడుగుల (5.50 మీటర్ల) వెడల్పున సింగిల్ లైన్ రోడ్డు ఉండేది. 12లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునేందుకు వీలుగా ఈ కరకట్ట సగటు ఎత్తు సుమారు 4.50 మీటర్లు ఉండేలా నిర్మించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ