చెన్నై, 1 అక్టోబర్ (హి.స.): కరూర్‌లో టీవీకే అధినేత విజయ్(Vijay) ప్రచారం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని, విద్యుత్ సరఫరాను నిలిపేశారని, ఉద్దేశపూర్వకంగా ప్రచారమార్గంలో అంబులెన్సులను నడిపారంటూ వస్తున్న విమర్శలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు సమాధానం చెప్పారు. సచివాలయంలో ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అముద, ఆరోగ్యశాఖ కార్యదర్శి సెంథిల్‌కుమార్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల్లో రేగుతున్న ప్రతి సందేహానికి వారు వీడియో ఆధారంగా సమాధానాలిచ్చారు.
టీవీకే నిర్వాహకులు విజయ్ ప్రచారానికి 10 వేల మంది వస్తారని పోలీసులకు చెప్పి అనుమతి పొందారని, అయితే గతంలో ఆయన సభలకు వచ్చిన జనాన్ని బట్టి తాము 20 వేల మంది వస్తారని ఊహించి పోలీసు భద్రత కల్పించామని పేర్కొన్నారు. సాధారణంగా 50 మందికి ఒక పోలీసు చొప్పున ఏర్పాటు చేస్తామని, కానీ కరూర్‌లో 20 మందికి ఒక పోలీసు చొప్పున నియమించామన్నారు. ఆ సభకు సుమారు 27,000 మంది హాజరయ్యారన్నారు. పోలీసులు లేకపోతే తాను ఇక్కడకు రాలేనని సాక్షాత్తు విజయే ఆ రోజు సభలో ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు.
పార్టీ అధ్యక్షుడి వెంట వచ్చిన కార్యకర్తలు, అప్పటికే సభ జరిగే ప్రాంతంలో వున్న అధిక ప్రజల కారణంగా రద్దీ ఏర్పడిందని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV