వారణాసి/దిల్లీ: 1 అక్టోబర్ (హి.స.) హాకీ మాజీ ఆటగాడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒలింపియన్ దివంగత మహమ్మద్ షాహిద్ ఇంటిలో కొంత భాగాన్ని రోడ్డు విస్తరణలో అధికారులు కూల్చివేశారు. ఇది కాస్తా రాజకీయ దుమారం రేపుతోంది. ఈ చర్యను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. 1980 ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణపతకం సాధించిన జట్టులో షాహిద్ సభ్యుడు. 2016లో ఆయన మృతి చెందాడు. కాగా షాహిద్ పూర్వీకుల ఇల్లు కచేరీ- సంధహా మార్గంలో ఉంది. రోడ్డు విస్తరణంలో భాగంగా ఆ ఇంటిలోని కొంత భాగాన్ని అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌రాయ్ అధికార ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘పద్మశ్రీ మహమ్మద్ షాహిద్‌రాయ్ ఇంటిని భాజపా ప్రభుత్వం నేలమట్టం చేసింది. ఇది కేవలం ఇల్లు కాదు, దేశ క్రీడా వారసత్వానికి నిదర్శనం’’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశ వీరులపై భాజపాకు గౌరవం లేదంటూ మండిపడ్డారు. దీనిపై భాజపా మహానగర్ అధ్యక్షుడు ప్రదీప్ అగ్రహారి స్పందిస్తూ.. కాంగ్రెస్‌వి నిరాధారమైన వాదనలని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ