ముంబయి, 1 అక్టోబర్ (హి.స.) యూఏఈకి చెందిన ఎమిరేట్స్(Emirates) విమానాల్లో నేటినుంచి కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఇకపై తమ ఫ్లైట్‌లలో పవర్ బ్యాంక్‌ల వినియోగంపై నిషేధం (Bans use of Power Banks) విధిస్తున్నట్లు విమానయాన సంస్థ ఎమిరేట్స్ ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు 100 వాట్ల పవర్ కంటే తక్కువ పవర్ బ్యాంక్‌ను బ్యాగేజీతోపాటు తీసుకెళ్లవచ్చు. కానీ, విమానంలో మాత్రం వాటిని ఉపయోగించకూడదు. దీంతో ఇకపై ఎమిరేట్స్ ప్రయాణికులు విమానంలో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్‌లు ఉపయోగించే అవకాశం లేదు.
విమానాల్లో (Emirates flights) ప్రయాణాల సమయాల్లో ప్రయాణికులు ఎక్కువగా పవర్ బ్యాంక్‌లను వినియోగిస్తుండడం వల్ల ఆన్‌బోర్డ్ విమానాలలో లిథియం బ్యాటరీలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఇలా నిషేధం విధించినట్లు విమానయాన సంస్థ తెలియజేసింది. విమానాల్లో తీసుకురావడానికి ఆమోదించిన పవర్ బ్యాంకులకు సంబంధించిన స్పష్టమైన సామర్థ్య రేటింగ్‌లను వినియోగదారులు ముందుగానే ఎయిర్‌లైన్స్‌కు తెలియజేయాలని.. వాటిని ఓవర్‌హెడ్ కంపార్ట్‌మెంట్లలో కాకుండా సీటు జేబులో లేదా ముందు సీటు కింద మాత్రమే ఉంచాలని ఎమిరేట్స్ పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ