దిల్లీ: 1 అక్టోబర్ (హి.స.)
డీఆర్డీవో (DRDO) ఆధ్వర్యంలో ఐదో తరం స్టెల్త్ యుద్ధవిమానాల అభివృద్ధి కోసం ప్రారంభమైన ఏఎమ్‌సీఏ (Advanced Medium Combat Aircraft) ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ఏఎమ్‌సీఏ నమూనాలను రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి ఏడు భారతీయ కంపెనీలు డీఆర్‌డీవో సంస్థతో భాగస్వామ్యం కోసం బిడ్లు దాఖలు చేశాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 125 యుద్ధ విమానాలను డీఆర్‌డీవో భాగస్వామ్యంలో తయారు చేయనున్నారు (AMCA prototype bid).
ఈ ప్రోటోటైప్ కోసం బిడ్‌లు వేసిన వాటిల్లో లార్సెన్ అండ్ టూబ్రో, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ వంటి సంస్థలు ఉన్నాయి. వాటి బిడ్‌లను మాజీ బ్రహ్మోస్ ఏరోస్పేస్ చీఫ్ ఎ శివథాను పిళ్లై నేతృత్వంలోని కమిటీ పరిశీలించి రక్షణ మంత్రిత్వ శాఖకు నివేదికను సమర్పిస్తుంది. మంత్రిత్వ శాఖ తుది ఎంపిక చేస్తుంది. కమిటీ ఇద్దరు బిడ్డర్లను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. ఆ సంస్థలకు రూ. 15,000 కోట్లు విలువైన పనులు అప్పగిస్తారు.
రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టు అయిన ఏఎమ్‌సీఏ ఫైటర్లు 2035 నాటికి భారత వైమానిక దళంలోకి చేరనున్నాయి (Indian stealth jet). అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఐదో తరం యుద్ధ విమానాలను కలిగి ఉన్న దేశాల ప్రత్యేక జాబితాలో భారత్ కూడా చేరుతుంది. ఇప్పటికి ఐదో తరం విమానాలు అమెరికా, (F-22 మరియు F-35), చైనా (J-20), రష్యా (Su-57) వద్ద మాత్రమే ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ