ఢిల్లీ, 11 అక్టోబర్ (హి.స.)ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత పర్యటనలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ నుండి మినహాయింపు పొందిన తర్వాత ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు. తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహాత్మక, భద్రతా అంశాల దృష్ట్యా ఆందోళనలు ఉన్నప్పటికీ, తాలిబన్‌లతో భారత్ తన సంబంధాలను పెంచుకుంటోందనే దానికి ఈ పర్యటన నిదర్శనం. అయితే ముత్తాకి ప్రెస్‌మీట్‌కు మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంతో వివాదానికి దారితీసింది. దీనిపై జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మహిళలు హాజరుకాకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై మీడియా ప్రశ్నించినా రాయబార కార్యాలయం పట్టించుకోలేదు. ఈ చర్యను నిరసిస్తూ చాలా మంది జర్నలిస్టులు, సోషల్ మీడియా వినియోగదారులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళా రిపోర్టర్లు డ్రెస్ కోడ్‌ను కూడా గౌరవించినప్పటికీ అనుమతించకపోవడం విమర్శలకు దారితీసింది.
భారత్ వైఖరి.. క్రమంగా..
ఆగస్టు 2021లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు, భారత్ వెంటనే తన రాయబార కార్యాలయాన్ని మూసివేసి, భారత పౌరులను తరలించింది. అయితే 2022 జూన్‌లో భారత్ ఆఫ్ఘాన్‌లో మానవతా సహాయం అందించడం, పర్యవేక్షించడం కోసం కాబూల్‌లో ఒక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత విదేశాంగ కార్యదర్శి దుబాయ్‌లో ముత్తాకిని కలిశారు. వాణిజ్యం, మానవతా సహాయం, చాబహార్ నౌకాశ్రయం వంటి అనేక అంశాలపై చర్చించారు. ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత అధికారులు ముత్తాకిని కలవడం, ఆ తర్వాత ఇరువురు మంత్రుల మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగింది. తాలిబన్లు ఆ దాడులను ఖండించడంపై భారత్ కృతజ్ఞతలు తెలిపింది. పాకిస్తాన్‌తో ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు క్షీణించడం, భారత్‌కు తాలిబన్లతో స్నేహం చేయడానికి ఎక్కువ అవకాశాన్ని ఇచ్చింది.
భారత్, ఆఫ్ఘనిస్తాన్‌తో చారిత్రక సంబంధాలు ఉన్నాయని నమ్ముతూనే, తన భద్రతా ప్రమాదాలను కూడా దృష్టిలో పెట్టుకుంది. ముఖ్యంగా అల్ ఖైదా, ఐఎస్‌కేపీ, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల ఉనికిపై కేంద్రం ఆందోళన చెందుతోంది. అందుకే భద్రతా హామీల కోసం తాలిబన్‌లతో చర్చలు అవసరం. భారత్‌తో సంబంధాలు పెంచుకోవడం ద్వారా, తాలిబన్లు తమ దేశీయ ప్రజల ముందు చట్టబద్ధతను పొందాలని చూస్తున్నారు. అంతేకాక పాకిస్తాన్‌పై అధికంగా ఆధారపడకుండా, తమకంటూ ఒక ప్రత్యేక ఆర్థిక, విదేశాంగ విధాన గుర్తింపును ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వారు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు తిరిగి ప్రారంభించాలని, పెట్టుబడులను ఆహ్వానించాలని భారత్‌ను కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV