హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.)
మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం మరువక ముందే.. కాంగ్రెస్ క్యాబినెట్ మినిస్టర్స్ మధ్య మరో లొల్లి మొదలైంది. మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఆ శాఖకు చెందిన మంత్రుల మధ్య విభేదాలు ముదిరి రచ్చకెక్కాయి. మంత్రి పొంగులేటిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వరంగల్ రాజకీయాలతోపాటు దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నట్లు కొండా దంపతులు అందులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఫోన్ చేసిన కొండా మురళి ఆయనకు ఫిర్యాదు చేశారు. పొంగులేటి తన సొంత కంపెనీకి పనులు ఇప్పించుకుంటున్నారని తెలిపారు. ఆయన వల్ల జిల్లాలో తాము ఇబ్బంది పడుతున్నామని వెల్లడించారు. అదేవిధంగా జిల్లా రాజకీయాలను ఖర్గేకి వివరించారు. పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు