హనుమకొండ, 11 అక్టోబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పేద
ప్రజల సంక్షేమం కేసీఆర్ తోటే సాధ్యమని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య అన్నారు. శనివారం హన్మకొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో రఘునాథపల్లి మండలం శివాజీ నగర్ గ్రామానికి చెందిన గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింగరావు మరియు మాజీ సర్పంచ్ శివరాత్రి కొమురయ్య ఆధ్వర్యంలో డాక్టర్ రాజయ్య సమక్షంలో పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులకు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర పాలన విషయంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, పాలనను గాలికి వదిలేసిందని, పర్సంటేజీల పాలన కొనసాగిస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కేవలం కె.సి.ఆర్ నాయకత్వంలోనే సాధ్యమనే విషయాన్ని గ్రహించిన యువత బీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరడం ఆనందదాయకం అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు