హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.)
బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్
హెచ్చరికలు నిజమవుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ పాలిట బనకచర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారబోతోందని.. ఏపీ ప్రభుత్వం కేంద్రం సహకారంతో బనకచర్లపై ముందుకెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా పరోక్షంగా సహకరిస్తోందని ధ్వజమెత్తారు. ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. బనకచర్ల ప్రాజెక్టును కొనసాగిస్తున్నామని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారన్నారు. వరద జలాలపై ప్రాజెక్టు రిపోర్టులు ఆమోదించకూడదు. కానీ బనకచర్ల ప్రాజెక్టు పీఎస్ఆర్ పరిశీలిస్తున్నామని కేంద్రం లేఖ రాస్తే సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లకుండా నిద్రపోతున్నారని ధ్వజమెత్తారు. 423 టీఎంసీలు ఏపీ మళ్లించుకుంటోందని కాబట్టి 112 టీఎంసీలు ఆల్మట్టిలో ఆపుకుంటామని కర్ణాటక లేఖ రాసింది. మరో వైపు వరద జలాలతో విదర్భలో ప్రాజెక్టులు కట్టుకుంటామని మహారాష్ట్ర సిద్ధమవుతోంది. ఇంత జరుగుతున్నా సీఎంగా ప్రజాప్రయోజనాలు కాపాడతావా లేక స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటావా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..