హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.)
సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఇటీవల మహాత్మాగాంధీపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్రదుమారం రేపుతున్నాయి. కొందరు అతను చెప్పినవని నిజాలంటుంటే.. మరికొందరు మాత్రం గాంధీజీపై అలాంటి వ్యాఖ్యలు చేయడంసరికాదంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా.. శ్రీకాంత్ అయ్యంగార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీపై అతను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కూడా పోలీసులకు సమర్పించారు. మహాత్ముడిపై నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసిన ఘటనపై టాలీవుడ్ పెద్దలు స్పందించాలని కూడా డిమాండ్ చేశారు.
అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాంత్ అయ్యంగార్ గాంధీపై ఆరోపణలు చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం అతని వల్ల రాలేదని, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వీరుల త్యాగఫలితంగా మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఆ వీడియోపై వచ్చిన కామెంట్లకు స్పందిస్తూ.. మరోసారి గాంధీపై ఆరోపణలు చేశారు. 'నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తాయి. వాటిని పెద్దగా పట్టించుకోను. కానీ గాంధీ గురించి నేను చెప్పింది నిజం' అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన బల్మూరి వెంకట్.. శ్రీకాంత్ అయ్యంగార్ పై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..