మహబూబ్నగర్, 11 అక్టోబర్ (హి.స.)
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో గొర్రెలు దొంగతనం, బైక్ చోరీలు, ఇండ్లలో చోరీలు మరియు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ జానకి ధరావత్ గారి ఆధ్వర్యంలో, అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు సీఐలు, ఏడుగురు ఎస్సైలు మరియు 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం ఏడు కీలక ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేయడం, రాత్రిపూట అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తులను ప్రశ్నించడం, గస్తీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ జానకి ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. ఇతర గ్రామాలకు వెళ్లే సమయంలో తమ విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు బ్యాంకులలో లేదా లాకర్లలో భద్రపరచాలి. గొర్రెల కాపరులు రాత్రిపూట రహదారుల సమీపంలో గొర్రెల మందలను ఉంచరాదు. ఎక్కడ ఉంచినా వాటిని గమనిస్తూ దగ్గరలో ఉండాలి. గ్రామంలో లేదా రోడ్లపై అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు కనిపించినచో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. రాత్రివేళ వాహనాలు నడిపే వారు అప్రమత్తంగా ఉండాలి, మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు. జన భద్రత, చోరీల నివారణ, మరియు రోడ్డు ప్రమాదాల తగ్గింపే ఈ డ్రైవ్ ముఖ్య ఉద్దేశ్యమని ఎస్పీ గారు స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులతో సహకరిస్తే, సమాజంలో శాంతి భద్రతలు మరింత మెరుగవుతాయని ఆమె అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు