హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.)
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి విశ్వరూపం ప్రదర్శించిన సినిమా ప్రతిఘటన విడుదలై నేటికీ 40 సంవత్సరాలు. ఈ సందర్భంగా
నాలుగు దశాబ్దాల నాటి చిత్రాన్ని ఈ రోజు విజయశాంతి గుర్తు చేసుకున్నారు. ఎక్స్ (X) వేదికగా విజయశాంతి ఓ ట్వీట్ చేశారు. 1985 అక్టోబర్ 11 'ప్రతిఘటన' చిత్రం విడుదల అయిందని విజయశాంతి గుర్తు చేసుకున్నారు. 40 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం అని రాసుకొచ్చారు. నన్ను సూపర్ స్టార్గా నిలబెట్టి, అత్యంత విజయవంతమైన సెన్సేషనల్ హిట్గా 'ప్రతిఘటన' నిలిచిందని చెప్పుకొచ్చారు. నంది అవార్డును తెచ్చిపెట్టిన ఈ చిత్రాన్ని స్మరించుకుంటూ ఆ చిత్ర దర్శకులు టీ. కృష్ణ, నిర్మాత రామోజీరావు, 'ఈ దుర్యోధన దుశ్శాసన' అద్భుతమైన పాటను అందించిన వేటూరికి, పాడిన ఎస్ జానకి అమ్మకు, మాటల రచయిత MVS హరనాథ్ రావుకు, సహ నటి నటులకు, సాంకేతిక నిపుణులకు విశేషంగా ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు