అమరావతి, 11 అక్టోబర్ (హి.స.)
ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన 'ఆమె సూర్యుడిని కబళించింది' పుస్తకాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు పవన్, సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని సూచించారు.
ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించాలని పవన్ పేర్కొన్నారు. తన ఆలోచనను ఇతరులతో పంచుకుంటానని పవన్ తెలిపారు. పుస్తకాలు తనపై చాలా ప్రభావం చూపాయన్నారు. ఒక పుస్తకం చదువుతుంటే ఎన్నో అంశాలు నేర్చుకుంటామని, సాధించదలుచుకుంటే పట్టుదల అవసరం అని తెలిపారు. ఆమె సూర్యుడిని కబళించింది పుస్తకంలో మాలతి క్యారెక్టర్ ను చదివానని, పుస్తకం ఎంతో స్ఫూర్తినిచ్చిందని కితాబిచ్చారు. ఆ పాత్రలో ధైర్య సాహసాలు మేధస్సు, భారతీయ స్వాతంత్రం ఆనాటి సంస్కృతి సంప్రదాయం పుస్తకంలో కనిపిస్తాయన్నారు. మా అమ్మ వంట గది నుంచి ప్రపంచాన్ని చూసిందని గుర్తు చేసుకున్న పవన్.. రాష్ట్రంలో మహిళలకు 33% రిజర్వేషన్లు త్వరలో అమలు కాబోతున్నాయని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV