హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.)
రేపు (సోమవారం) రాష్ట్ర ఎన్నికల కమిషన్ జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అనంతరం నామినేషన్ల పర్వం మొదలు కానుంది. రేపట్నుంచి ఈనెల 21వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ల పరిశీలన జరగనున్నాయి. ఈనెల 24వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉండనున్నాయి.
జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్.. రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించి ఈసీఐ నిబంధనలకు లోబడి అన్ని ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి పి. సాయిరాంకు సూచించారు. కాగా.. నామినేషన్ల ప్రక్రియ జరిగే షేక్ పేట తహసీల్దార్ కార్యాలయం, చుట్టుపక్క ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
కాగా.. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. బీఆర్ఎస్ సెంటిమెంట్ ను వాడాలని భావించి.. మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దించింది. మరోవైపు కాంగ్రెస్.. ప్రజాదరణ ఎక్కువగా ఉన్న నవీన్ కుమార్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. నేడు బీజేపీ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు