అమరావతి, 12 అక్టోబర్ (హి.స.)పేదలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ మేరకు జీవోను సైతం విడుదల చేసింది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో 50 చదరపు గజాల్లో ఇంటి నిర్మాణం చేసుకునే వారికి పెద్ద ఊరట కలిగించింది. గతంలో ఉండే ఫీజును పూర్తిగా మినహాయించింది. 50 చదరపు గజాల్లో రెండు అంతస్తుల్లోపు (జీప్లస్-1) నిర్మాణం చేసుకునేవారు ఇక మీదట అన్ని అనుమతులకు కేవలం రూపాయి చెల్లిస్తే సరిపోతుంది. గతంలో రెండంతస్తులకు రూ.5 వేల వరకు అనుమతుల ఫీజులతో పాటు లబ్ధిదారుల వద్ద అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడేవారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పేదలకు ఆర్థికంగా ఉపశమనం దక్కింది.
జిల్లాలో 425 దరఖాస్తులు:ఇంటి నిర్మాణంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనల ప్రకారం 50 చదరపు గజాల్లో మాత్రమే ఇంటి నిర్మాణం చేయాలి. రెండంతస్తుల వరకు నిర్మాణం చేసుకోవచ్చు. వంద గజాలు ఉండి దానిని 50 గజాలకు తగ్గించి నిర్మాణం చేస్తామంటే కుదరదు. ప్రభుత్వ స్థలాలు, వివాద స్థలాల్లో ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వరు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ