అమరావతి, 17 అక్టోబర్ (హి.స.)రాజధాని అమరావతిలో ప్రభుత్వం మరో రెండు ‘4 స్టార్’ హోటళ్లు, అరకులో ఏకో లగ్జరీ రిసార్ట్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. దీంతో పాటు టూరిజం పాలసీ 2024-29లో భాగంగా ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అమరావతిలో సదరన్ గ్లోబల్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ సంస్థ నాలుగు నక్షత్రాల హోటల్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు దసపల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా నాలుగు నక్షత్రాల హోటల్‌ను నిర్మించాలని నిర్ణయించింది. అరకులో వీఎస్కే హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఎకో లగ్జరీ రిసార్ట్స్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మూడింటి ఏర్పాటుకు ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీలో అనుమతి కూడా ఇచ్చింది. వీటికి టూరిజం పాలసీ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది.
వంద శాతం ఎస్‌జీఎస్టీని పదేళ్ల పాటు రీయింబర్స్‌మెంట్ చేయనున్నారు. ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో 10 శాతం ప్రభుత్వం అందించనుంది. వంద శాతం స్టాంప్ డ్యూటీ రాయితీ ఇవ్వనుంది. పరిశ్రమల ధరలకే విద్యుత్తు సరఫరా చేయనుంది. ఐదేళ్ల పాటు విద్యుత్తు సుంకాన్ని కూడా తిరిగి చెల్లించనుంది. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులన్నీ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టూరిజం ఆథారిటీ సీఈవోకి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ