విశాఖపట్టం, 19 అక్టోబర్ (హి.స.)ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా రైళ్లు పట్టాలు తప్పుతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ప్రతి రోజు కనీసం ఒక్కటైనా ఇలాంటి సంఘటన జరగుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ ఘటన అల్లూరి జిల్లాలోని కేకే లైన్ సమీపంలో చోటు చేసుకుంది. అయితే పట్టాలపై కొండచరియలు విరిగిపడటంతో ఇలా జరిగినట్లు తెలుస్తుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంలో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. తెడా- చిమిడిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. ప్రస్తుతం ఆ మార్గంలో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే ఈ సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్క సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే దీనికి మరింత సమయం పట్టనుండటంతో విశాఖ- కిరండోల్, కిరండోల్-విశాఖ రైళ్లను అధికారులు రద్దు చేసినట్లు ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV