సిడ్నీ , 19 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా చేరుకున్నారు. సిడ్నీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా తెలుగుదేశం బృందం ఆధ్వర్యంలో తెలుగు ప్రజలు కుటుంబ సమేతంగా విచ్చేసి లోకేశ్ కు స్వాగతం పలికారు.
తెలుగుదేశం ఆస్ట్రేలియా అధ్యక్షుడు విజయ్, ఉపాధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో బ్రిస్బేన్, కాన్బెర్రా, అడిలైడ్, మెల్బోర్న్, న్యూజిలాండ్, న్యూకాసిల్ నుండి తెలుగు ఎన్నారైలు సిడ్నీ విమానాశ్రయానికి చేరుకుని మంత్రి లోకేశ్ కు స్వాగతం పలికారు. మంత్రి లోకేశ్ అందరినీ ఆప్యాయంగా పలకరించి, వారితో ఫోటోలు దిగారు. విమానాశ్రయంలో అభిమానులు టీడీపీ జెండాలు చేబూని లోకేశ్ కు స్వాగతం పలికారు. లోకేశ్ పర్యటన నేపథ్యంలో సిడ్నీలో పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
లోకేశ్ ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానం మేరకు సిడ్నీ చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాలను సందర్శించి అధునాతన బోధనా పద్ధతులను లోకేశ్ అధ్యయనం చేయనున్నారు.
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో నారా లోకేశ్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరిపి రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరాతో లోకేశ్ సమావేశమవుతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV