హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.) ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిల పెండింగ్పై ప్రైవేటు వృత్తి విద్యా, ఇంజినీరింగ్ కాలేజీలు మరోసారి పోరుకు సిద్ధమయ్యాయి. పెండింగ్ ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 3 నుంచి బంద్ (Colleges Bandh) పాటిస్తామని ప్రైవేట్ కళాశాలల సమాఖ్య తెలిపింది. ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసులు అందజేస్తామని వెల్లడించింది. ఈనెల 25న విద్యార్థి సంఘాలతో, 26న సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని, నవంబర్ 1వ తేదీ నాటికి అన్ని పార్టీల నేతలతో కలిసి సమావేశం జరపాలని ఫతి నిర్ణయించింది.
పెండింగ్ బకాయిలపై సెప్టెంబర్ 15 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని ప్రైవేటు కాలేజీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వంతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో రెండు రోజుల పాటు కాలేజీలు తెరచుకోలేదు. అయితే విడతల వారీగా ఫీజులు చెల్లిస్తామని సర్కార్ ఒప్పుకోవడంతో బంద్ను విరమించాయి. సెప్టెంబరులో రూ.600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలను చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అలాగే తొలుత రూ.600 కోట్లను చెల్లించి.. మిగిలిన బకాయిల్లో మరో రూ. 600 కోట్లను దీపావళి సందర్భంగా విడుదల చేస్తామని పేర్కొంది. అయితే దీపావళి వచ్చినా ఇంకా నిధులు మంజూరు చేయకపోవడంతో కాలేజీల బంద్ తప్పడంలేదని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వెల్లడించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..