చెన్నై, 20 అక్టోబర్ (హి.స.)
తమిళనాడు వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. చెన్నై ఎయిర్పోర్టులోకి వరద నీళ్లు చేరడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఓ వైపు దీపావళి.. ఇంకోవైపు భారీ వర్షాలు. వేడుకలపై వర్షం ప్రభావం చూపిస్తోంది. అంతేకాకుండా దీపావళి వ్యాపారంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నగరంలోని వేలచేరి, మేదవాక్కం, పల్లికరణై, ఈసీఆర్ నీలంకరైతో సహా శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
భారీ వర్షాలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం చెన్నైలోని రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాభావ పరిస్థితి, ఈశాన్య రుతుపవనాల సంసిద్ధతపై సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు