జగిత్యాల, 20 అక్టోబర్ (హి.స.)
కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా.. బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఏ పనులు అయినా సరే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే కట్టబెడుతున్నారని పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను జీవన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా బీర్పూర్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన కమిటీ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక పెంబట్ల దేవాలయం కమిటీ తప్ప అన్ని దేవాలయ కమిటీలను బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకే ఇచ్చారని పేర్కొన్నారు. ఇలా అయితే పార్టీలో మా పరిస్థితి ఏంటి మంత్రి గారూ అని అడిగారు.
తాము రాహుల్గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నామని జీవన్ రెడ్డి తెలిపారు. జై బాపు జై భీమ్ జై సంవిదాన్ అంటూ ముందుకు పోతున్నాం అని అన్నారు. తాము వలసదారులలాగా దోచుకొని దాచుకునే వారిమి కాదని.. కాంగ్రెస్ నాయకులమని తెలిపారు. తాము కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులమని.. కౌలుదారులం కాదని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు