ముంబై, 20 అక్టోబర్ (హి.స.)దీపావళి పండగ వేళ భారత స్టాక్ మార్కెట్లు లాభాల వెలుగులు విరజిమ్మాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే కీలక సూచీలు అర శాతంపైగా లాభాలతో దూసుకెళ్లాయి. ఇన్వెస్టర్లలో పండగ ఉత్సాహం స్పష్టంగా కనిపించడంతో దలాల్ స్ట్రీట్‌లో కొనుగోళ్ల సందడి నెలకొంది. ఈ సానుకూల వాతావరణంలో బ్యాంక్ నిఫ్టీ సరికొత్త రికార్డు స్థాయిని తాకింది.
ఈ ఉదయం ట్రేడింగ్ మొదలైన వెంటనే సెన్సెక్స్ 661 పాయింట్లు (0.8 శాతం) పెరిగి 84,614 వద్ద నిలిచింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 191 పాయింట్లు (0.74 శాతం) లాభపడి 25,901 మార్కు వద్ద ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, హెవీవెయిట్ స్టాక్స్‌లో బలమైన కొనుగోళ్లు కనిపించాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ట్విన్స్ వంటి షేర్లు 3 శాతం వరకు లాభపడ్డాయి.
.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ 26,000 స్థాయిని దాటితేనే కొత్తగా కొనుగోళ్లు చేపట్టడం మంచిదని వారు అభిప్రాయపడ్డారు. మార్కెట్ పెరిగినప్పుడు పాక్షికంగా లాభాలు స్వీకరిస్తూ, స్టాప్-లాస్‌లను కచ్చితంగా పాటించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని విశ్లేషకులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV