చెన్నై/ఢిల్లీ,20, అక్టోబర్ (హి.స.) తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై విమానాశ్రయంలో రన్‌వేపైకి నీళ్లు చేరడంతో ఎక్కడికక్కడే విమానాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఆదివారం రాత్రి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో, నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. తూర్పు తీర రోడ్డు (ECR) వెంబడి ఉన్న వేలచేరి, మేదవాక్కం, పల్లికరణై, నీలంకరై ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలోని అనేక ప్రాంతాల్లో ప్రయాణికులు మోకాలి లోతు నీటితో ఇబ్బంది పడ్డారు. వర్షాల నేపథ్యంలో జాగ్రత్త వహించాలని అధికారులు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు