
హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.)
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ వేముల శ్రీనివాసులు, డీజీపీ శివధర్ రెడ్డి, HMWSSB ఎండీ అశోక్ రెడ్డి, తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌర సరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలన్నారు. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ప్రతీ కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి వారికి బాధ్యతలు అప్పగించాలన్నారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాళ్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి 24 గంటల పరిస్థితిపై ప్రతి రోజూ కలెక్టర్కు రిపోర్ట్ అందజేయాలన్నారు. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ ఒక్క అధికారి ఫీల్డ్లో ఉండాల్సిందేనని, జిల్లా కలెక్టర్, ఎస్పీలు సంయుక్తంగా పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..