
తిరుమల, 31 అక్టోబర్ (హి.స.)
: తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో ఇది కనిపించింది. 150వ మెట్టు వద్ద రోడ్డు దాటుతున్న చిరుతను చూసి భక్తులు కేకలు వేశారు. సులభ్ కార్మికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చిరుత సంచారం ఉన్నట్లు నిర్ధారించారు.
భద్రతా చర్యల్లో భాగంగా 800వ మెట్టు వద్ద, శ్రీవారి మెట్టు ప్రారంభ ప్రాంతంలో భక్తులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం భక్తులను 100-150 మందిని గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. అటవీ అధికారులు చిరుతను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని.. సిబ్బందితో సమన్వయం చేసుకుని మెట్టు మార్గం ద్వారా తిరుమల చేరాలని సూచించారు. చిన్నపిల్లలను చేత పట్టుకొని వెళ్లాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ