
హుజురాబాద్, 30 అక్టోబర్ (హి.స.)
ప్రజా రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ అవసరమైతే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగాలు చేసిన పోలీసుల సేవలు మరువలేనివి, వారి అమరత్వం అజరామరం అని హుజూరాబాద్ ఏసీపీ వి. మాధవి ఉద్ఘాటించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా గురువారం రోజున హుజరాబాద్ పట్టణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శిబిరాన్ని ప్రారంభించిన ఏసీపీ మాధవి మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం తమ జీవితాలను అర్పించిన పోలీసుల అమరత్వం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పోలీసులు నిత్యం ప్రజల సేవలో నిమగ్నమై ఉంటారు. 24 గంటలు పనిచేసేది కేవలం పోలీసులేనని ఆమె పేర్కొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పోషించే పాత్ర కీలకమని, వారి నిస్వార్థ సేవకు సమాజం ఎప్పుడు రుణపడి ఉంటుందని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు