
హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్ మహానగరంలో పాదచారుల కోసం మరో ఆరు స్కైవాక్స్ నిర్మించాలని హెచ్ఎండీఏ కసరత్తు చేస్తున్నది. నగరంలో 23 ప్రాంతాల్లో స్కైవాక్స్ అవసరమని హెచ్ఎండీఏ గుర్తించింది. అందులో ఇప్పటికే ఉప్పల్ జంక్షన్ లో ఈ స్కైవాక్ నిర్మాణం పూర్తయింది. దీంతో పాదచారులు ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి సులభంగా మారింది. మెహదీపట్నంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతోపాటు పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వద్ద స్కైవాక్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. వీటితోపాటు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, జంక్షన్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్కైవాక్ నిర్మాణాలపై దృష్టి పెట్టింది.
గ్రేటర్ హైదరాబాద్ లోని ఆయా ప్రాంతాల్లో ప్రాధాన్యతా క్రమంలో స్కై వాక్స్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా అఫ్టల్గంజ్, మదీన, లక్షీకాపూల్ పెట్రోల్బంక్, బీహెచ్ఎల్, జేఎన్టీయూ, మియాపూర్ టీ జంక్షన్లలో స్కైవాక్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం హెచ్ఎండీఏకు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఉప్పల్ స్కైవాక్ను అందుబాటులోకి తీసుకొచ్చిన హెచ్ఎండీఏ.. మెహదీపట్నంలోని స్కైవాక్ పనుల్లో వేగం పెంచింది. సికింద్రాబాద్లో కూడా రైల్వేస్టేషన్కు, మెట్రో స్టేషన్లకు, బస్టాండ్లకు అనుసంధానంగా స్కైవాక్ నిర్మాణానికి హెచ్ఎండీఏ కసరత్తు చేస్తున్నది. దీనికి సంబంధించిన డిజైన్ కూడా తయారు చేశారు.
కూకట్ పల్లి జేఎన్టీయూ జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ తోపాటు పాదచారుల రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. రోడ్డు దాటాలంటే పాదచారులకు గగనంగా మారింది. ట్రాఫిక్ జామ్ కావడానికి పాదచారుల రాకపోకలు కారణంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పల్ తరహాలో భారీ స్కైవాక్ నిర్మించాలని హెచ్ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ స్కైవాక్ జేఎన్టీయూ జంక్షన్, మెట్రో స్టేషన్, బస్టేషన్, లూలూ మాల్ వంటి ప్రాంతాలను కలుపుతుంది. జేఎన్టీయూ క్యాంపస్ కేంద్రంగా స్కైవాక్ నిర్మిస్తున్నారు. దీన్ని స్పెషల్ హబ్ గా తీర్చిదిద్దాలని హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..