
సూర్యాపేట, 30 అక్టోబర్ (హి.స.)
ప్రజల రక్షణలో పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. వర్షాల దృష్ట్యా మూసినది ఉధృతంగా ప్రవహిస్తున్నందున సూర్యాపేట రూరల్ పరిధి వేదేరివారి గూడెం వద్ద మూసి నది పై భీమారంలో లెవెల్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహ పరిస్థితిని గురువారం ఎస్పి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధిక వర్షాల వల్ల చెరువులు నదులు కుంటలు నిండి ప్రమాదకర రీతిలో ఉన్నాయని వాటిలోకి ఎవరు దిగవద్దని కోరారు.
తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాల దృష్ట్యా చెరువులు కుంటలు నీటితో నిండి ఉండి ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయని, దీనిపై జిల్లా పోలీస్ శాఖ ప్రమాదకరంగా ఉన్న స్థలాల వద్ద భద్రతా చర్యలు తీసుకున్నారన్నారు. పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం నీటి ప్రవాహంలోకి ఎవరు వెళ్లకుండా రోడ్ల పై బారికేడ్లు, వాహనాలు అడ్డుగా పెట్టారన్నారు. అలాగే రోడ్ల పై విరిగిపడిన చెట్లను తొలగించడం, నీటి ప్రవాహంలో చిక్కుకున్న వాహనాలను తీయడం, ప్రమాదంలో ఉన్నప్రజలను కాపాడారని, తెగిపోయిన రోడ్లను సంబంధిత అధికారులతో కలిసి మరమ్మతులు చేశారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు