
అమరావతి, 30 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. పెట్టుబడుల ఆకర్షణకే ప్రాధాన్యతనిస్తూ లండన్ పర్యటన (London trip)కు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. నవంబర్ 1 నుంచి ఐదు రోజులపాటు లండన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు.. పలు అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సమావేశమవనున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక రంగం విస్తరణకు దోహదపడే విధంగా కొత్త పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా చేసుకొని ఈ పర్యటన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే విశాఖపట్నంలో త్వరలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit)కు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు.
లండన్‌లో సీఐఐ (CII) ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్‌షోలో పాల్గొని ఆంధ్రప్రదేశ్‌లోని పెట్టుబడి అవకాశాలను చంద్రబాబు వివరిస్తారు. రాష్ట్రం ఇప్పటికే ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతులు, పరిశ్రమల రంగాల్లో భారీ అవకాశాలను కలిగి ఉందని వివరించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించి, పెట్టుబడుల సహకారం, టెక్నాలజీ మార్పిడి, ఉద్యోగావకాశాల సృష్టి వంటి అంశాలపై చర్చించనున్నారు. నవంబర్ 6న సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కదులుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV